బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది ఈ వ్యాఖ్యల వీడియోను వైరల్ చేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే నుపుర్ వ్యాఖ్యలపై శుక్రవారం రోజు ఢిల్లీ, యూపీలోని ప్రయాగ్ రాజ్, షహరాన్ పూర్ తో జార్ఖండ్ రాంచీ, బెంగాల్ హౌరాలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రయాగ్ రాజ్, హౌరాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
ఇదిలా ఉంటే కాశ్మీర్ కు చెందిన యూట్యూబర్ ఫైసల్ వానీ నుపుర్ శర్మ తల నరుకుతున్నట్లుగా వీఎఫ్ఎక్స్ చేసి వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. ఉద్రిక్తతలను పెంచే వీడియోను పోస్ట్ చేసినందుకు ఫైసల్ వానీ క్షమాపణలు చెప్పాడు. ‘‘నేనే వీడియో చేసాను కానీ నాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు. నేను వీడియోను తొలగించాను, క్షమాపణలు కోరుతున్నాను. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నేను చాలా క్షమించండి’’ అని క్షమాపణలు కోరాడు.
అయితే తాజాగా ఈ వీడియో కాశ్మీర్ లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యూట్యూబర్ ఫైసల్ వానీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఉందని అధికారులు ఆరోపించారు. సఫా కడల్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాశ్మీర్ పోలీసులు.
చాలా చోట్ల ఇలాగే సోషల్ మీడియా పోస్టులు చేయడం వల్ల ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి. యూపీలో జరిగిన ఘటనల్లో కూడా ఇదే విధంగా సోషల్ మీడియా పోస్టులే హింసాత్మక సంఘటనలకు కారణం అయ్యాయి. దీంతో సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను సస్పెండ్ చేస్తున్నారు అధికారులు.