263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదే విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపడుతోంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే.. ఈడీ తాజాగా కేసు పెట్టింది. అయితే.. మరోవైపు, ఈ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరాన్ని నేడు సీబీఐ విచారించనుంది. విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో కార్తీ చిదంబరానికి సమన్లు జారీ చేసింది.
బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, బుధవారం ఉదయం కార్తీ చిదంబరం తరపు న్యాయవాది సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారని అధికారులు తెలిపారు. న్యాయవాదిని విచారించాల్సిన అవసరం లేదని… కార్తీ చిదంబరమే స్వయంగా రావాలని చెప్పి పంపినట్లు తెలిపారు. ఈ క్రమంలో నేడు కార్తీ చిదంబరంను ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు.