Hubballi riot: 2022 కర్ణాటక హుబ్బల్లి అల్లర్లు, మతకలహాల కేసులో కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీసులపై దాడి చేసిన గుంపు నాయకత్వం వహించారే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇతెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నాయకులపై కేసులు ఉపసంహరించుకుంది. ఎంఐఎం నేత మహ్మద్ ఆరిఫ్‌తో సహా 138 మందిపై క్రిమినల్ కేసులను విత్ డ్రా చేసుకుంది. వీరంతా పోలీసులపై అటాక్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్‌పై దాడులకు పాల్పడ్డారు. ఏప్రిల్ 2022లో హుబ్బల్లి అల్లర్ల సమయంలో హింసను ప్రేరేపించారని వారు ఆరోపించారు.
వీరిపై హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడటం, క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. ప్రాసిక్యూషన్, పోలీస్, న్యాయ శాఖ నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2023లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ కేసుల్ని ఉపసంహరించుకోవాలని, అభియోగాలను పున:పరిశీలించాలని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కి లేఖ రాశారు. శివకుమార్ సిఫారసులతో ఎఫ్ఐఆర్, సాక్షుల వాంగ్మాలాలతో సహా సంబంధిత కేసు సమాచారాన్ని సేకరించే బాధ్యత హోం శాఖకు అప్పగించారు.
Read Also: Dussehra 2024: దసరా తిథి, ఆయుధ పూజలకు అనుకూలమైన సమయం?
అయితే, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ విరుచుకుపడింది. ముస్లింలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించింది. ఉగ్రవాదులకు మద్దతిస్తూ వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. రైతులు, విద్యార్థులపై కేసులు పెండింగ్‌లో ఉండగా, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కేసులు విత్ డ్రా చేసుకుంటున్నారని అన్నారు.
ఏప్రిల్ 16, 2022లో మసీదుపై కాషాయ జెండాను ఉంచినట్లు అవమానకరమైన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హుబ్బల్లిలో అల్లర్లు చెలరేగాయి. దీంతో ముస్లిం వర్గాలు ఆందోళనలు చేశాయి. హుబ్బల్లీ పోలీస్ స్టేషన్ ముందు భారీగా గుంపు చేరి, దాడికి పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు పోలీసులకు గాయాలు కాగా, ప్రజా ఆస్తులకు గణనీయమైన నష్టం కలిగింది.