దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. విజయదశమి రోజున శ్రీరాముడు లంకాపతి రావణుని సంహరించాడు. ఇది కాకుండా, విజయదశమి పండుగ దుర్గమాతతో కూడా ముడిపడి ఉంటుంది. ఈ రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. దసరా పండుగను ప్రతి సంవత్సరం అశ్విన్ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. విజయదశమి రోజున దేశవ్యాప్తంగా రావణ దహనం జరుగుతుంది. అలాగే ఆయుధాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది. దసరా రోజున రావణ దహనం, ఆయుధ పూజలు ఏ సమయం నుంచి ప్రారంభిస్తాయో తెలుసుకుందాం.
దసరా ఎప్పుడు:
హిందూ క్యాలెండర్ ప్రకారం.. దశమి తిథి అక్టోబర్ 12న ఉదయం 10:59 గంటలకు ప్రారంభమవుతుంది. దశమి తిథి అక్టోబర్ 13న ఉదయం 9:07 గంటలకు ముగుస్తుంది. దసరా పండుగను అక్టోబరు 12న మాత్రమే జరుపుకోవాలి.
రావణ దహనం శుభ సమయం:
దసరా నాడు, శ్రావణ నక్షత్రం యొక్క శుభ యాదృచ్చికం ఉన్న విషయం తెలిసిందే. దసరాలో శ్రావణ నక్షత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దసరా పండుగను శ్రావణ నక్షత్రంలో జరుపుకునే సంప్రదాయం ఉంది. శ్రావణ నక్షత్రం అక్టోబర్ 12 ఉదయం 5:24 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అక్టోబర్ 13 ఉదయం 4:27 వరకు కొనసాగుతుంది. రావణ దహనానికి శ్రావణ నక్షత్రం ఉండటం చాలా ముఖ్యం. అందుచేత అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5.52 గంటల నుంచి 7.26 గంటల వరకు రావణ దహనానికి శుభ సమయం. ప్రదోష కాలంలో రావణ దహనం నిర్వహించాలి.
ఆయుధ పూజలకు అనుకూలమైన సమయం:
హిందూ క్యాలెండర్ ప్రకారం.. దసరా పూజలకు అక్టోబరు 12వ తేదీ మధ్యాహ్నం 2:04 నుంచి మధ్యాహ్నం 2:48 గంటల వరకు అనుకూల సమయం. ఈ కాలంలో దసరా పూజలు, ఆయుధ పూజలు చేయడం శుభప్రదం.
ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
పురాణాల ప్రకారం.. పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు. ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారని నమ్మిక. అంతే కాకుండా పాండవులు వనవాసానికి వెళ్లినప్పుడు ఆయుధాలను జమ్మి చెట్టుమీద పెట్టారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా రోజు జమ్మి చెట్టుకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే కాకుండా మరో కథనం కూడా ప్రకారంలో ఉంది. పురాణాల ప్రకారం ఈ పూజ దుర్గాదేవి మహిషాసుర రాక్షసుడితో యుద్ధం చేసేందుకు దేవతలందరూ తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారట. అలా ఎనిమిది చేతుల్లో అమ్మవారు అనేక ఆయుధాలను పట్టుకుని యుద్ధానికి దిగారట. తొమ్మిది రోజుల పాటు సాగిన యుద్ధ పోరాటంలో చివరికి రాక్షసుడిని సంహరించినదని పురానాలు చెబుతున్నాయి. అనంతరం ఆయుధాలను దేవతలు తిరిగి తీసుకుని రాక్షస సంహారం చేసి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా వాటిని పూజించారు. నాటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. వివిధ కుల వృత్తుల వాళ్లు వారి ఆయుధాలకు పూజలు నిర్వహిస్తారు.
గమనిక : పైన పేర్కొన్న సమాచారం నమ్మకాల మీమీ నమ్మకాల మీద ఆధారపడి ఉంది. అంతర్జాలంలో లభించిన సమాచారం మేరకు ఇచ్చాం. ఇది కేవలం సమాచారం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.!