Mallikarjun Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. విజయం అనంతరం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, కర్ణాటక ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘బీజేపీ ముక్త్ దక్షిణ భారత్’’ అయిందని బీజేపీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీపై కాంగ్రెస్ జెండా ఎగరేశాం అని చెప్పారు. కాంగ్రెస్ ను గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. చాలా సార్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీని అవమానపరిచిందని అన్నారు. మాది ప్రజా ప్రభుత్వం అని, ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూశామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఇది ఏ ఒక్కరి విజయం కాదని, కన్నడ ప్రజల ఆశీస్సులు అని తెలిపారు. 35 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు వచ్చాయని తెలిపారు. ఈ గెలుపుతో మాపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.
డీకే శివకుమార్:
వ్యక్తి పూజమానుకుని పార్టీని అభిమానిద్ధాం అని కర్ణాటక పీసీసీ చీఫ్ సిద్ధరామయ్య అన్నారు. ఇది కన్నడ ప్రజల విజయం అని తెలిపారు. కర్ణాటకు మూడేళ్లుగా పట్టిన గ్రహణం వీడిందని, మా గెలుపుకు మార్గదర్శి సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలే అని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ గెలుపని అన్నారు. మైసూర్ చాముండేశ్వరీ అమ్మవారి పాదాల సాక్షిగా నేను, సిద్ధరామయ్య ఇద్దరం కలిసి హామీలను నెరవేరుస్తామని తెలిపారు.
సిద్ధరామయ్య:
మా క్యాబినెట్ తొలి సంతకం హామీ ఇచ్చిన 5 పథకాలపై చేస్తామని సిద్ధారామయ్య తెలిపారు. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు చేసిందని, మోడీ పది సార్లు రోడ్ షోలు చేసిన జనం పట్టించుకోలేదని, కాంగ్రెస్ జనం అంచనాలను రీచ్ అవుతుందని అన్నారు.
కేసీ వేణుగోపాల్:
1977లో ఇందిరా గాంధీ ఓడిపోయినప్పుడు కూడా ఇలానే కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా అన్నారు.. ఆ సమయంలో కాంగ్రెస్ ను కాపాడింది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లే అని గుర్తు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా మేమే విజయం సాధిస్తాం అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ వయసులో కూడా ఖర్గే మాతోనే ప్రయాణం చేశారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి సోనియా గాంధీ వచ్చారని, ఆమె ఆశీసులతోనే విజయం సాధ్యమైందని చెప్పారు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం, కన్నడ ప్రజలు ప్రధానిని తిరస్కరించారని, 2024లో పోరాడి విజయం సాధించుకుందాం అని పిలుపునికచ్చారు.