Karnataka: కర్ణాటక చిత్తాపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ర్యాలీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. శాంతిభద్రతల సమస్యను పేర్కొంటూ అధికారులు అనుమతికి నిరాకరించారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన వ్యక్తి, సంస్థ శతాబ్ది ఉత్సవాలకు, విజయదశమి ఉత్సవం కోసం పట్టణంలో చిన్న స్థాయి ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరారు. దీనికి పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైంది.
ఆదివారం ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు అనుమతి కోరిన అదే మార్గంలో భీమ్ ఆర్మీ,భారతీయ దళిత్ పాంథర్ (R) సంఘ్ కూడా తమ సొంత ఊరేగింపులను నిర్వహించడానికి అనుమతి కోరాయని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఏకకాలంలో ఊరేగింపులు జరిగితే ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉందని పోలీస్ నిఘా సూచించింది. చిత్తాపూర్ ఎమ్మెల్యే, కర్ణాటక మంత్రి అయిన ప్రియాంక్ ఖర్గేను ఇటీవల ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుర్భాషలాడి చంపుతానని బెదిరించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచింది.
Read Also: Hyderabad Metro Scare: మూసాపేట మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ కలకలం!
ఇదిలా ఉంటే, ఈ వివాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గతంలో బీజేపీ ప్రభుత్వమే ఏదైనా ప్రైవేట్ సంస్థ, సంఘం, వ్యక్తుల సమూహం ప్రభుత్వ ఆస్తిని లేదా ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసిందని సీఎం గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్‌ను టార్గెట్ చేయడం లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రాజకీయం చేస్తూనే ఉంటుందని, పేదల కోసం ఏం చేయదని ఆయన అన్నారు.
అయితే, అనుమతి నిరాకరించడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి నిరాకరించడం ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నిరంకుశ పాలనను గుర్తు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఒకప్పుడు దేశంపై అత్యవసర పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ చీకటి చరిత్ర పట్ల మంత్రి ప్రియాంక్ ఖర్గేకు చాలా అభిమానం ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే బహుశా ఆయన చిట్టాపూర్‌ను పరీక్షా స్థలంగా ఉపయోగించి కలబురగి జిల్లాలో అత్యవసర పరిస్థితి లాంటి పరిపాలనను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.’’ అని రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయేంద్ర యెడియూరప్ప విమర్వించారు.