Communal clashes in Karnataka: కర్ణాటకలో మతాంతర ప్రేమ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ ఘటన కర్ణాటక కొప్పల్ జిల్లా హులిహైదర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హులి హైదర్ గ్రామానికి చెందిన హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుని పారిపోయారు. దీంతో వీరిద్దరిని పోలీసులు పట్టుకువచ్చి ఇరు కుటుంబాలకు అప్పగించాయి. ఈ ఘటన నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోని ఇరు వర్గాలు పరస్పరం చేరి దాడికి పాల్పడ్డాయి. అబ్బాయి, అమ్మాయి ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలపై దాడి చేశారు. ఇటీవల మొహర్రం పండగ వేళ అమ్మాయిని, అబ్బాయి కలిసేందుకు వెళ్లిన క్రమంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది.
రెండు వర్గాలు కర్రలు, ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వెంకప్ప తలవద్(60), పాషా వలి(22) తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో పలు ఇళ్ల కిటికీలు ధ్వంసం అయ్యాయి. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితులు అదుపలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో మతపరమైన ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. ఇటీవల మంగళూర్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్త హత్య, దీని తర్వాత మరో యువకుడి హత్య జరగడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం రేపాయి. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.