Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.
Read Also: Shraddha Walkar Case: అడవిలో దొరికిన వెంట్రుకలు, ఎముకలు శ్రద్ధావే.. కన్ఫామ్ చేసిన డీఎన్ఏ టెస్ట్
ఇదిలా ఉంటే తనను కుక్కపిల్లతో పోలుస్తూ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య చేసిన విమర్శలపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కౌంటర్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఇది కాంగ్రెస్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని..కుక్క విశ్వాసానికి ప్రతీక అని.. పనిని నమ్మకంగా చేస్తుందని.. నేను ప్రజల కోసం విశ్వాసంగా పనిచేస్తున్నాని అన్నారు. సిద్దరామయ్యలా నేను సమాజాన్ని రెండుగా విభజించలేదని విమర్శించారు.
సిద్దరామయ్య తనను బహిరంగ చర్చకు రావాలాంటున్నాడని.. అయితే అసెంబ్లీ కన్నా పెద్ద వేదిక ఏది లేదని సీఎం అన్నారు. శాసన సభ కన్నా పవిత్రమైనది ఏదీ లేదని సీఎం బొమ్మై అన్నారు. సిద్ధరామయ్య, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ముందు నిలబడలేకపోయారని.. కర్ణాటకకు ఒక్క పైసా తీసుకురాలేదని బొమ్మై విమర్శించారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత కర్ణాటకకు 6000 కిలోమీటర్ల హైవే రహదారులను ఇచ్చారని, రాబోయే రోజుల్లో ఎగువ కృష్ణా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి గ్రాంట్లు విడుదల చేస్తాం అని అన్నారు. కర్ణాటకలోని ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ కామధేనువు లాంటి వారని సీఎం అన్నారు.