Shraddha Walkar Case: యావత్ దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్దావాకర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెలుగులోకి రావడంతో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం శ్రద్ధావాకర్ శరీర భాగాలను పారేసిన ప్రాంతం నుంచి ఎముకలు, వెంట్రుకలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు. డిఎన్‌ఎ మైటోకాన్డ్రియల్ ప్రొఫైలింగ్ కోసం పోలీసులు పంపిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధా వాకర్ వే అని తేలింది. అటవీ ప్రాంతంలో దొరికన వెంట్రుకలు, ఎముకలు శ్రద్ధా తండ్రి, సోదరుడి డీఎన్ఏతో సరిపోలాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: MP Maloth Kavitha : మానవత్వం చాటుకున్న ఎంపీ మాలోత్ కవిత
డీఎన్ఏ వెలికితీయలేని నమూనాలను డిఎన్‌ఎ మైటోకాన్డ్రియల్ ప్రొఫైలింగ్ కోసం సెంటర్ ఫర్ డిఎన్‌ఎ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సిడిఎఫ్‌డి) హైదరాబాద్‌కు పంపినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. తాజాగా వీటి పరీక్షా ఫలితాలు వచ్చినట్లు.. ఒక ఎముక, వెంట్రుకలు శ్రద్ధావే అని నిర్థారించారు. ఎముకలను ప్రస్తుతం శవపరీక్ష కోసం పంపుతామని..వీటికి ఎయిమ్స్ లోని మెడికల్ బోర్టు పరీక్షలు నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు.
సహజీవనంలో ఉన్న శ్రద్ధావాకర్ ని ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసిన తర్వాత శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీ శివార్లలోని అటవీ ప్రాంతంలో పారేశాడు. ఈ హత్య మే 18న జరిగినా.. శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో నవంబర్ 12న వెలుగులోకి వచ్చింది. 35 ముక్కలను 300 లీటర్ల ఫ్రిజ్ లో దాచిపెట్టి 3 వారాల పాటు వాటిని నగరం అంతటా పారేశాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే అఫ్తాబ్ పూనావాలా నేరాన్ని ఒప్పుకున్నాడు. నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షల్లో కూడా నేరాన్ని అంగీకరించాడు అఫ్తాబ్ పూనావాలా.