పొగ కారణంగా ఇంట్లో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కన్నడ నటి ఐంద్రితా రే ఆవేదన వ్యక్తం చేసింది. నిత్యం తన ఇంటి చుట్టూ చెత్తను తగలబెడుతున్నారని వాపోయింది. ఇలాగైతే ఎలా జీవించేది అంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఐంద్రితా రే.. బెంగళూరులో నివాసం ఉంటుంది. ఆర్ఆర్ నగర్‌లోని ఐడియల్ హోమ్స్ ప్రాంతంలో ఇల్లు ఉంది. ఇంటి దగ్గరలోనే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను నిత్యం కాల్చడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానిక వాసులతో పాటు హీరోయిన్ కుటుంబం కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆమెనే స్వయంగా రంగంలోకి దిగి.. సంఘటనాస్థలికి వెళ్లి పరిస్థితుల్ని గమనించింది. తన ఇంటి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడాలంటూ హీరోయిన్ వీడియోను పోస్ట్ చేసింది.

నివాస సముదాయాల దగ్గర చెత్తను బహిరంగంగా ఎలా తగలబెడతారని.. ఇది అధికారులు నిర్లక్ష్యమేనని తప్పుపట్టారు. చాలా రోజులుగా ఇలాగే జరుగుతుందని.. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు ఆమె తెలిపింది.
ఇది కూడా చదవండి: Live in Relationships: సహజీవనం తప్పేమీకాదు.. జంటలకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు
దాదాపు మూడు రోజుల నుంచి చాలా అసౌకర్యానికి గురవుతున్నట్లు వాపోయింది. స్వయంగా తానే రంగంలోకి దిగి వీడియో షూట్ చేసినట్లు చెప్పింది. నివాస ప్రాంతాల దగ్గరే చెత్త కాల్చడం వల్లే ఈ సమస్య తలెత్తిందని.. అధికారులకు తెలియజేసేందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు చెప్పింది. తక్షణ చర్యలు తీసుకోవాలని నటి కోరింది.