‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. జవాన్లను కోపాద్రిక్తుల్ని చేశాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన కైలాష్.. ‘‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమిస్తాడు. ఆ సమయంలో అతడు రూ. 11 లక్షలు అందుకోవడంతో పాటు అగ్నివీర్ బ్యాడ్జ్‌ని ధరిస్తాడు. అనంతరం ఇతర విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, మొదటి ప్రాధాన్యత వీరికే ఇస్తారు. ఒకవేళ బీజేపీ కార్యాలయానికి సెక్యూరిటీని నియమించాల్సి వస్తే, నేను అగ్నివీర్‌కే ప్రాధాన్యత ఇస్తా’’ అని అన్నారు.
ఈ విధంగా కైలాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రేయింబవళ్లు కష్టపడి.. ఫిజికల్‌తో పాటు సాధారణ టెస్టులు రాసి జవాన్లు పాసయ్యేది దేశ సేవ కోసం కానీ, ఏదో ఒక పార్టీ కార్యాలయానికి సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసేందుకు కాదంటూ ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇదే టైంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం ఆయన వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. దేశ యువత, భారత ఆర్మీని అగౌరవపర్చొద్దని హితవు పలికారు. అటు.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కైలాష్ విజయవర్గీయ మాటలతో అగ్నిపథ్ స్కీమ్‌పై ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయని తెలిపింది. ఇందుకోసమేనా అగ్నిపత్ స్కీమ్‌కు తీసుకువస్తున్నారంటూ ఎద్దేవా చేసింది.