JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!

Jp Nadda Meeting

Jp Nadda Meeting

JP Nadda – CJP Leaders: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నాయకుల సమావేశం ముగిసింది. తమ డిమాండ్లను ప్రభుత్వం శ్రద్ధగా విన్నదని, వాటిని పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని సీజేపీ నేతలు వెల్లడించారు. సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగిందని, తమ ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీజేపీ ప్రతినిధి బృందం జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రభుత్వం తమ సమస్యలపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

సమావేశం తర్వాత తమ మద్దతుదారులకు శాంతిని పాటించాలని సీజేపీ నేతలు కీలక విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలను కాపాడుతూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనకారులను బలవంతంగా తొలగించే ఆలోచన లేదని వర్గాల సమాచారం. ఈ సందర్భంగా వాళ్లు డిమాండ్స్ గురించి మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.

మరోవైపు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంపై స్పందించారు. ఆదివారం ఉదయం నిరసనకారుల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉదయం 11:50 గంటలకు మొదలైన చర్చల్లో మొదట మౌఖికంగా సమస్యలను విన్నామని, అనంతరం సాయంత్రం లిఖితపూర్వక వినతిపత్రంపై చర్చించామని పేర్కొన్నారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. నిరసనకారులు ఆందోళన విరమించి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సహకరించాలని జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి ప్రభుత్వ తదుపరి నిర్ణయంపైనే ఉంది.