Soumya Vishwanathan: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఇటీవల నిందితులకు కోర్టు జీవితఖైదు విధించింది. తన కూతురికి న్యాయం జరిగిందని సంతోషించేలోపలే, సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్ శనివారం కన్నుమూశారు. 82 ఏళ్ల ఎంకే విశ్వనాథన్ విచారణకు రెండు రోజుల ముందు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే, తన కూతురి హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందని తెలుసుకున్నారు.
26 ఏళ్ల సౌమ్యవిశ్వనాథన్ తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో 2008లో హత్యకు గురయ్యారు. ఆమె తల్లిదండ్రులు ఎంకే విశ్వనాథన్, మాధవి విశ్వనాథన్ తన కుమార్తె న్యాయం జరిగేలా సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. 15 ఏళ్ల విచారణలో వారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
Read Also: Congress: “ఆ ఎంపీ బిజినెస్‌లో మాకు సంబంధం లేదు”.. ఐటీ రైడ్స్‌కి దూరంగా కాంగ్రెస్..
జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో నిందితులకు ఇటీవల ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పు ప్రకటించింది. ఇండియా టుడే గ్రూప్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథాన్ని సెప్టెంబర్ 30, 2008 తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్‌లో హత్య చేశారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితులు కాల్చి చంపారు. అయితే చోరీ చేయాలనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. నేరం జరిగిన 15 ఏళ్ల తరువాత నిందితులకు శిక్షను విధించింది. హత్య, సాధారణ ఉద్దేశంతోనే రవి కపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను అక్టోబర్ 18న కోర్టు దోషులుగా నిర్ధారించింది.