Congress: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆయన నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిండి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి ఐటీ అధికారులు సాహు టార్గెట్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కోట్లకు కోట్ల నగదు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ధీరజ్ సాహు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు.
ధీరజ్ సాహు కాంగ్రెస్ ఎంపీ కావడంతో బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ.. రాహుల్ గాంధీతో ధీరజ్ సాహూ ఉన్న వీడియోను షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోను ఉద్దేశిస్తూ.. ‘‘దొంగల యాత్ర’’ అంటూ విమర్శించారు.
Read Also: Anti-Semitism: యూదులు దెబ్బ అదుర్స్.. యూఎస్ టాప్ వర్సిటీ ప్రెసిడెంట్ రాజీనామా..
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఎంపీ ఆస్తుల నుంచి ఆదాయపన్ను అధికారులు ఎలా భారీ మొత్తంలో నగదు కనుగొన్నారో ఆయన మాత్రమే చెప్పగలరని అన్నారు. ఆదాయపు పన్ను శాఖ దాదాపు రూ. 300 కోట్ల లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు చెప్పారు.
ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శనివారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలకు అవినీతిలో ప్రమేయం ఉండటం ఇది తొలిసారి కాదని అన్నారు. స్కామ్ ఉన్న చోట కాంగ్రెస్ నాయకుడు ఉంటానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోట్ల లెక్కింపులో మనుషులే కాదు, యంత్రాలు కూడా విసిగిపోయాయని, అవినీతిపరుడైన కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 200 అవినీతి బయటపడింది..ఎవరివి..? గాంధీ కుటుంబంలోని ఏటీఎం ఇదేనా..? అంటూ ప్రశ్నించారు.