Woman SI Brutally Killed: హర్యానాలో డీఎస్పీ హత్య జరిగిన కొద్ది సమయంలోనే అదే తరహాలో జార్ఖండ్‌లో మహిళా ఎస్సై దారుణంగా హత్యకు గురైంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో గత రాత్రి సంధ్యా టోప్నో అనే మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హత్యకు గురికాగా.. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు.
మృతురాలు సంధ్యా టోప్నో తుపుదానా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్‌స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్‌కు తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఎస్సై సంధ్య వాహనంలో పశువులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఆపడానికి ప్రయత్నించిందని.. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఆమె పైకి వాహనాన్ని ఎక్కించి మరణానికి కారణమయ్యాయడని రాంచీ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కౌశల్ కిషోర్ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్ అధికారిని మైనింగ్ మాఫియా హత‍్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
Haryana: హర్యానాలో దారుణం.. అక్రమ మైనింగ్ అడ్డుకోబోయిన డీఎస్పీని తొక్కించి చంపిన వైనం
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని మంగళవారం ప్రకటించారు. దోషులను విడిచిపెట్టబోమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను నియంత్రిస్తామని, బాధ్యులను విడిచిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో పోలీసు పోస్టులను ఏర్పాటు చేస్తామని, మైనింగ్ వాహనాల గమ్యం, వాటి సామగ్రిని కూడా స్థిరపరుస్తామని ఖట్టర్ చెప్పారు.