Indian Weddings: భారతీయులు చదువుల కన్నా వివాహాలపై ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఇది భారతీయ ఆర్థిక రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. భారతదేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ భారతీయ ఎకానమీని ప్రభావితం చేస్తోంది. దీని విలువ 130 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాకింగ్ అండ్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ జెఫరీస్ ఈ నివేదికను వెల్లడించింది. భారతదేశంలో వివాహ పరిశ్రమ అనేది ఆహారం-నిత్యావసరాల తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా ఉందని నివేదిక తెలిపింది. భారతదేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ అమెరికా మార్కెట్ పరిమాణం కన్నా రెండింతలు, చైనా మార్కెట్ కన్నా తక్కువగా ఉందని జెఫరీస్ చెప్పింది.
Read Also: Rahul gandhi: రాహుల్‌గాంధీకి ప్రమోషన్.. ప్రతిపక్ష నేతగా నియామకం
దేశంలో విహహాలపై సగటు ఖర్చు 15,000 డాలర్లు అంటే దాదాపుగా రూ. 12.5 లక్షలుగా ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషమేంటంటే, భారతదేశంలో వివాహం చేసుకునే జంటలు ప్రాథమిక విద్య నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అయ్యే ఖర్చు కన్నా రెండింతలు ఖర్చు పెడుతున్నాయి. అమెరికాలో ఇందుకు విరుద్ధంగా విద్య మీద పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇండియాలోని తలసరి ఆదాయం కన్నా పెళ్లిళ్లపై పెట్టే ఖర్చు దాదాపుగా 5 రెట్లు అధికం. ఇండియాలో తలసరి ఆదాయం రూ. 2.4 లక్షలు. సగటు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4 లక్షల కన్నా మూడు రెట్లు ఎక్కువ. ఇండియాలో వివాహ ఖర్చు-జీడీపీ శాతం చాలా దేశాల కన్నా అధికంగా ఉంది. రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు ఖరీదు చేసే విలాసవంతమైన వివాహాలు కూడా అధిక వ్యయంతో కూడుకున్నవని నివేదిక తెలిపింది.
అయితే భారతీయ వెడ్డింగ్ ఇండస్ట్రీ పరిమాణం, స్థాయి కారణంగా ఇది ఇతర రంగాలైన ఆభరణాలు, దస్తులు, క్యాటరింగ్, ప్రయాణం సహా వివిధ రంగాలకు కీలకమైన వృద్ధికి తోడ్పాటు అందిస్తోందని నివేదిక తెలిపింది. ఆభరణాల పరిశ్రమలో దాదాపుగా సగానికి పైగా ఆదాయం పెళ్లి ఆభరణాల నుంచి వస్తోంది. మొత్తం దుస్తుల ఖర్చులో 10 శాతం వివాహాల నుంచే వస్తుంది. మొత్తం పెళ్లి ఖర్చులో 25 శాతం ఆభరణాలు, 20 శాతం క్యాటరింగ్, ఈవెంట్‌కి 15 శాతం వెళ్తోంది.