Darshan Case: హత్య నేరంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ దర్శన్ తనకు దుప్పటి కావాలని కోర్టును కోరాడు. బుధవారం బెంగళూరులోని ట్రయల్ కోర్టులో అదనపు దుప్పటి కోసం విన్నవించుకున్నాడు. చలి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. విచారణ ప్రక్రియ కోసం దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. చలి కారణంగా తాను నిద్రపోలేకపోతున్నానని, అధికారులు తనకు దుప్పటి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. జైలు అధికారులు తన కుటుంబం ఇచ్చిన దుప్పటిని కూడా అనుమతించడం లేదని ఆయన అన్నారు.
Read Also: CM Chandrababu: గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది..
అయితే, కోర్టు పదే పదే ఆదేశాలు ఇచ్చినప్పటికీ జైలు అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. చలి వాతావరణంలో అధికారులు దుప్పటిని నిరాకరిస్తే విచారణ జరిపి, వెంటనే దర్శన్‌కు దుప్పటి అందించాలని ఆదేశించారు. ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న నాగరాజ్‌కు కూడా, అధికారులు దుప్పటి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, దర్శన్ వాదనల్ని బలపరిచారు.
దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలో ఉన్నారు. జూన్ 8, 2024న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి, హత్య చేశారు. దర్శన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు ఊహాగానాలు ఎదుర్కొంటున్న పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడనే కోపంతో దర్శన్, ఆయన సన్నిహితులు హత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో బెంగళూర్ పోలీసులు 3991 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్రలతో పాటు మరో 15 మందిని అరెస్ట్ చేశారు.