Jagdeep Dhankhar Takes Oath As Vice President: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కొత్తగా ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగ్‌దీప్ ధన్‌కర్ కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌కర్ గెలుపొందారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై భారీ విజయాన్ని నమోదు చేశారు. 1997 నుంచి గత ఆరు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో లేనట్టుగా భారీ మార్జిన్ తో విజయం సాధించి జగ్‌దీప్ ధన్‌కర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఏకంగా 74.36 శాతం ఓట్లను సంపాదించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో లేనటు వంటి వైసీపీ, బీజేడీ, టీడీపీ, శిరోమణి అకాళీదళ్ వంటి పార్టీలు కూడా జగ్‌దీప్ ధన్‌కర్ కు మద్దతు ఇచ్చాయి. దీంతో భారీ విజయాన్ని నమోదు చేశారు.
Read Also: Supreme Court: ‘ఉచితాలు’ పెద్ద సమస్య.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం..!
గతంలో అడ్వకేట్ గా కెరీర్ ప్రారంభించిన ధన్ కర్ అంచెలంచెలుగా భారత రెండో అత్యున్నత పదవిని చేపట్టారు. ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. 2019 నుంచి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. ఆ సమయంలో ప్రజల గవర్నర్ గా పేరు తెచ్చుకున్నారు.సీఎం మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించి దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. మమతా బెనర్జీ పట్ల ఇంత వ్యతిరేకత ప్రదర్శించిన ధన్ కర్ కు టీఎంసీ మద్దతు ఇవ్వలేదు.. అలా అని కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వకుండా.. ఓటింగ్ కు దూరంగా ఉంది.