Sourav Ganguly: జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి మృతి అవమానకరమని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు ఉండాల్సిన అవసరముందన్నారు. యూనివర్సిటీలో చదివే అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి మరణంపై గంగూలీ శుక్రవారం స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మరణించిన సంఘటన హేయమైనదన్నారు. యూనివర్సిటీల్లో కఠినమైన చట్టాలను అమలు చేయాలన్నారు. ఆగస్ట్ 9వ తేదీ రాత్రి యూనివర్సిటీ హాస్టల్ బాల్కనీ నుంచి పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మరణానికి ముందు ర్యాగింగ్‌కు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీలు పిల్లలు చదువుకోవడానికి వచ్చే సంస్థలని యూనవర్సిటీల్లో ర్యాగింగ్ అవమానకరమని.. వర్సిటీలు వాటిపై నియంత్రణకు దృష్టి పెట్టాలన్నారు. ర్యాగింగ్‌ను నియంత్రించడానికి చట్టం చాలా కఠినంగా ఉండాలని సౌరవ్ గంగూలీ అన్నారు. విద్యార్థి మరణించిన కేసుకు సంబంధించి శుక్రవారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 12కి చేరింది.
Read also: Fire In Udyan Express: ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. కాసేపు ఆగి ఉంటే..?
విద్యార్థి మరణం అనంతరం జాదవ్‌పూర్ యూనివర్సిటీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాత్రిపూట క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి సందర్శకులకు గుర్తింపు కార్డులను తప్పనిసరి చేశారు. సమస్యాత్మక పాయింట్ల వద్ద CCTVలను ఇన్‌స్టాల్ చేశారు. గురువారం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాత్రి 8 నుండి ఉదయం 7 గంటల వరకు క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి విశ్వవిద్యాలయం జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరి చేశారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని అరికట్టడానికి ఇది సహాయపడుతుందని అధికారులు తెలిపారు. క్యాంపస్‌లోకి ప్రవేశించే ద్విచక్ర వాహనాలతో సహా అన్ని వాహనాలు ఇకపై విశ్వవిద్యాలయం జారీ చేసిన స్టిక్కర్లను కలిగి ఉండవలసి ఉంటుందని వర్సిటీ పేర్కొంది. “ద్విచక్ర వాహనాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు తప్పనిసరిగా యూనివర్సిటీ జారీ చేసిన JU స్టిక్కర్‌ను కలిగి ఉండాలి. JU స్టిక్కర్లు లేని వాహనాలు ప్రవేశించే ముందు విశ్వవిద్యాలయం యొక్క గేట్ వద్ద వారి రిజిస్ట్రేషన్ నంబర్‌ను అందించాలి. భద్రతా వ్యక్తులు అలాంటి అన్ని వాహనాలను నోట్‌లో ఉంచుకోవాలి. వాహనం యొక్క డ్రైవర్ లేదా ప్రయాణీకుల చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డును తప్పకుండా సమర్పించాల్సి ఉంటుందని వర్సిటీ జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.