Aditya-L1 Solar Mission: చంద్రుడిపై గట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించి ఇటీవల సక్సెస్ అయింది. చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అత్యంత కఠినమైన దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో చంద్రుడిపై కాలు మోపింది. ఈ ప్రయోగంతో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిపై అధ్యయనానికి ‘ఆదిత్య ఎల్1’ సోలార్ మిషన్ ప్రారంభించింది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 అబ్జర్వేటరీని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనుంది.
ప్రయోగం ఎలా..? ఎంత దూరం ఆదిత్య ఎల్1 ప్రయాణం:
శ్రీహరికోట లోని షార్ నుంచి సెప్టెంబర్ 2, ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్1తో పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ముందుగా ఆదిత్య ఎల్1ను తక్కువ భూ కక్ష్యలో, దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచుతుంది. ఆ తరువాత ఆదిత్య ఎల్1లో అంతరిక్ష నౌకలో ఉండే ఆన్ బోర్డ్ ప్రొపల్షన్ ఇంజన్లు నౌకను సూర్యుడు, భూమికి మధ్య ఉండే లాంగ్రాజ్ పాయింట్(L1) వైపు తీసుకెళ్తుంది.
అంతరిక్ష నౌక L1 పాయింట్ వైపు వెళ్లే క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుంది. భూమి గురుత్వాకర్షణ స్పియర్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ నుంచి నిష్క్రమించిన తర్వాత నౌక క్రూయిజ్ దశ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే L1 చుట్టూ పెద్ద హాలో కక్ష్యలో అంతరిక్ష నౌక చేరుతుతుంది. భూమి నుంచి L1 పాయింట్ చేరుకునేందుకు ఆదిత్య అంతరిక్ష నౌకకు దాదాపుగా 4 నెలల సమయం పడుతుంది.
ఆదిత్య-L1 మిషన్ ప్రధాన లక్ష్యాలు:
సూర్యుడి ఎగువ వాతావరణం( క్రోమోస్పియర్, కరోనా) అధ్యయనం. క్రోమోస్పియర్, కరోనల్ హీటింగ్, పాక్షికంగా ఆయనీకరణం చేయబడిన ప్లాస్మా భౌతిక శాస్త్రం, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సోలార్ ఫ్లేర్స్‌పై ఆదిత్య ఎల్ 1 అధ్యయనం చేస్తుంది.
సూర్యుడి పార్టికల్ డైనమిక్స్, ఇన్ సిటు పార్టికల్, ప్లాస్మా వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. సోలార్ కరోనా, కరోనల్ లూప్స్ డయాగ్నోస్టిక్స్, ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతపై అధ్యయనం.
కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) అభివృద్ధి, సౌర విస్పోటనానికి దారి తీస్తున్న పరిస్థితులను విశ్లేషిస్తుంది.
సోలార్ కరోనాలోని మాగ్నెటిక్ ఫీల్డ్ టోపాలాజీ, ఆయస్కాంత క్షేత్ర కొలతను అధ్యయనం చేస్తుంది. సోలార్ విండ్ అధ్యయనం.