Conversion racket: ‘‘జిమ్ సెంటర్లు’’ కేంద్రంగా ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్‌లో మతమార్పిడి ముఠా కార్యకలాపాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా హిందూ మహిళలే లక్ష్యంగా మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇప్పటి వరకు 50 మంది హిందూ మహిళల్ని టార్గెట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. జిమ్‌లను రిక్రూట్మెంట్లు పాయింట్లుగా, సోషల్ మీడియాను సాధనాలుగా ఉపయోగించి, బాధితుల్ని ట్రాక్ చేసేవారని తేలింది.
ఈ మొత్తం ముఠా ఆపరేషన్లలో సన్నో అనే మహిళ ముందు వరసలో ఉన్నట్లు తేలింది. ఈ ముఠాలో అనేక మంది పురుషులు సూత్రధారులుగా, కోర్ ఆపరేటర్లుగా వ్యవహరించారు. సన్నో మహిళలతో సులభంగా స్నేహం చేసేదని, వారి నమ్మకాన్ని పొందుతుందని, తర్వాత స్టెప్‌లో ఈ యువకులను బాధిత మహిళలకు పరిచయం చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ మహిళా నిందితురాలు సన్నో బాధిత మహిళల నమ్మకాన్ని పొందేందుకు కీలకంగా వ్యవహరించేదని తెలుస్తోంది.
నిందితులు తమ టార్గెట్ మహిళల్ని పంచుకునే వారని, ఒక జిమ్‌లో ఒక అమ్మాయిని ఆకర్షించలేకపోతే, ఆ బాధ్యతను ఆ ముఠా మరో జిమ్‌కు బదిలీ చేసేదని పోలీసులు తెలిపారు. బాధిత మహిళల్ని ట్రాప్ చేయడాని ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి, వారితో పరిచయం పెంచుకునే వారని తేలింది. అరెస్టయిన నిందితుల్లో ఒకరి మొబైల్ నుంచి పోలీసులు ప్రత్యేకంగా ఉన్న ఫోల్డర్‌ను స్వాధీనం చేసుకుని, వీటిలో ఫోటోలు, వీడియోలు, చాట్ హిస్టరీ, వందలాది డిజిటల్ ఫైల్స్ ఉన్నట్లు కనుగొన్నారు. అనేక మంది మహిళల్ని మతమార్పిడికి బలవంతం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ మొత్తం నెట్వర్క్‌లో పోలీసులు లక్కీ అలీని ప్రధాన సూత్రధారిగా గుర్తించి, అతడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇతడే జిమ్‌ల ద్వారా కార్యకలాపాలను కోఆర్డినేట్ చేసే వాడని తెలుస్తోంది. లక్కీ అలీ, ఇమ్రాన్ ఖాన్ లకు ఒక్కొక్కరికి రూ. 25,000 రివార్డును పోలీసులు ప్రకటించారు. వీరిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఇమ్రాన్ హిందు మహిళల్ని ఆకర్షించేందుకు సిక్స్-ప్యాక్ శరీరాన్ని షో చేసేవాడని, ఇలాంటి చిత్రాలను ఉపయోగించి మతమార్పిడి రాకెట్‌లోకి లాగే వాడని దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు.