IndiGo Sharjah-Hyderabad flight: ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం కారణంగా పాకిస్తాన్ కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. యూఏఈ షార్జా నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సమీపంలో ఉన్న కరాచీ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించారు. ఇండిగో ఫ్లైట్ 6ఈ-1406 విమానం షార్జా నుంచి బయలుదేరిన కొంత సేపటికి పైలెట్లు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా విమానాన్ని కరాచీకి మళ్లించారు. ఈ ఘటన ప్రయాణికులు అంతా సేఫ్ గా ఉన్నట్లు ఇండిగో వెల్లడించింది. ప్రయాణికులను హైదరాబాద్ తరలించేందుకు మరో విమానాన్ని కరాచీ పంపించినట్లు వెల్లడించింది.
Read Also: World Emoji Day: ఎమోజీ అంటే ఏంటి? వాటిని ఎందుకు వాడతాం?
రెండు వారాల్లో కరాచీలో ల్యాండ్ అయిన రెండో విమానం ఇది. జూన్ 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో దించారు. బోయింగ్ 737 రకానికి చెందిన స్పైస్ జెట్ ప్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. 138 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా విమానాన్ని ల్యాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఇండియాలో దేశీయ విమానప్రయాణాల్లో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్పైస్ జెట్ కు చెందిన విమానాలు ఇటీవల సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. సమీప విమానాశ్రయాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఇండిగో షార్జా- హైదరాబాద్ విమాన ఘటనకు రెండు రోజుల ముందు ఇదే సంస్థకు చెందిన ఓ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఢిల్లి నుంచి వడోదల వెళ్తున్న క్రమంలో విమానంలో ఒక సెకన్ పాటు కంపనాలు చోటుచేసుకున్నాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా జైపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విచారణ చేపట్టారు.