India On Turkey: పాకిస్తాన్‌కి ఇటీవల కాలంలో టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. టర్కీకి బలమైన సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి టర్కీ పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా ఉపయోగించుకోకుండా పాకిస్తాన్‌ని నిరోధించడానికి, దశాబ్దాలుగా ఆశ్రయం ఇస్తున్న ఉగ్రవాద ఎకో సిస్టమ్‌పై విశ్వసనీయమైన, ధ్రువీకరించదగిన చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీ టర్కీని కోరింది.
“పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేయాలని మరియు దశాబ్దాలుగా అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థపై విశ్వసనీయమైన,ధృవీకరించదగిన చర్యలు తీసుకోవాలని టర్కీ గట్టిగా కోరుతుందని మేము ఆశిస్తున్నాము. సంబంధాలు ఒకరి ఆందోళనలకు మరొకరి సున్నితత్వంపై ఆధారపడి ఉన్నాయి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు వీక్లీ మీడియా సమావేశంలో అన్నారు.
Read Also: Jyoti Malhotra: ‘‘గూఢచారి’’ జ్యోతి మల్హోత్రాకు స్పాన్సర్ చేసి పాక్ ట్రావెల్ సంస్థ
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ, పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చింది. భారత్ పై దాడి చేయడానికి పాకిస్తాన్ టర్కీ తయారీ డ్రోన్లను ఉపయోగించింది. ఇదే కాకుండా, వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కిష్ వ్యక్తుల్ని నియమించింది. అయితే, భారత్ జరిపిన దాడుల్లో టర్కీ డ్రోన్లు ధ్వంసం కావడంతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు.
ఈ నేపథ్యంలోనే భారత్, టర్కీ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టర్కీ నుంచి భారత్‌కి దిగుమతి అయ్యే ఆపిల్స్‌ని భారత వ్యాపారులు కొనడం లేదు. దీంతో పాటు టర్కీకి వెళ్లే టూరిస్టుల సంఖ్య చాలా తగ్గింది. ఇదే కాకుండా, ఎయిర్ పోర్టు గ్రౌండింగ్ సేవలు అందించే, టర్కీకి చెందిన సంస్థ సెలిబి అనుమతిని రద్దు చేసింది.