కాస్త పాజిటివ్ కేసులు తగ్గినా.. రికవరీ కేసులు పెరిగినా.. భారత్‌లో కరోనా విలయం మాత్రం కొనసాగుతూనే ఉంది.. సెకండ్ వేవ్‌లో ఇవాళ కూడా 3 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి… అయితే, భారత్‌లో కరోనా మహమ్మారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని.. ఆస్పత్రులపాలయ్యేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందని.. కోవిడ్ బారినపడి మృతిచెందేవారి సంఖ్య కూడా అధికంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్.. ఇదే సమయంలో.. కరోనా సోకిన మొదటి సంవత్సరం కంటే.. రెండో సంవత్సరంలో మరింత ప్రమాదకరంగా ఉంటుందని, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించారు టెడ్రోస్. మరోవైపు.. ఇండియాలో కరోనా ఉధృతిని అడ్డుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిస్థాయిలో సహకరిస్తోందని.. ఇప్పటికే వేల సంఖ్యలో ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్స్‌ను సరఫరా చేశామని.. మొబైల్ హాస్పిటళ్లకు టెంట్లు, మాస్క్‌లు, మెడికల్ సామాగ్రిని కూడా సమకూర్చినట్టు వెల్లడించారు.. ఇక, భారత్‌కు డబ్ల్యూహెచ్‌వో పంపించిన ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్స్, మందులు, మాస్క్‌లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.