Visa: ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఇండియా కారణం అంటూ ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సీనియర్ భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. అయితే ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, ప్రేరేపిత ఆరోపణలుగా ఖండించింది.
ఇదిలా ఉంటే కెనడాకు భారత్ షాక్ ఇచ్చింది. కెనడా పౌరులకు భారతీయ వీసాలను సస్పెండ్ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు వీసాల ప్రక్రియను నిలిపేసింది. ఆపరేషనల్ కారణాల వల్ల వీసాలను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ వార్తలపై విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కెనడియన్ల వీసా దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించేందుకు ఏర్పాటైన ప్రైవేటు ఏజెన్సీ మాత్రం తన వెబ్ సైట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది. నిర్వహణ కారణాల వల్ల సెప్టెంబర్ 21 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చయే వరకు భారత వీసాలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
Read Also: Switzerland: కొత్త చట్టం తీసుకువచ్చిన స్విట్జర్లాండ్.. బుర్ఖా వేసుకుంటే ఇకపై ఫైన్
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని ఈ ఏడాది జూన్ నెలలో కెనడా సర్రే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అప్పటి నుంచి కెనడా, భారత్ పై గుర్రుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రూడో ప్రభుత్వం ఖలిస్తాన్ మద్దతుదారుల మద్దతుతో నడుస్తోంది. దీంతో ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గిన ప్రభుత్వం భారత్ పై నిందులు వేస్తోంది. మరోవైపు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఈ విషయంలో భారత్ ని తప్పుపట్టాలని కెనడా కోరింది. అయితే వీరంతా భారత్ కి మద్దతు తెలుపుతున్నాయి. సరైన ఆధారాలతో ఆరోపణలు చేయాలని కోరాయి. మరోవైపు ఇరు దేశాలు కూడా తమ పౌరులకు ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేశాయి. జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.