Switzerland Parliament Approves ban on Burqas, Violators Should Pay Fine: బుర్ఖా కానీ, మరో వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇకపై నేరంగా పరిగణింపబడుతుంది. అయితే అది మన దేశంలో కాదు.. స్విట్జర్లాండ్ లో. బుధవారం ఉదయం స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొంతమంది ముస్లిం మహిళలు ధరించే బురఖాలతో సహా ముఖ కవచాలపై నిషేధాన్ని విధించింది. ఇప్పటికే ఎగువ సభ ఆమోదించిన ఈ చట్టాన్ని రైట్-వింగ్ పాపులిస్ట్ స్విస్ పీపుల్స్ పార్టీ సమర్థించింది. కొంత మంది దీనిని వ్యతిరేకించినప్పటికి అనుకూలంగా 151-29 ఓట్లతో దీనికి గణనీయమైన మద్దతు లభించింది.
రెండేళ్ళ క్రితం దేశవ్యాప్తంగా దీని గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. దీనిలో 51% మంది స్విస్ ఓటర్లు నిఖాబ్‌లు (కంటి చీలికలతో కూడిన ముఖ ముసుగులు), బురఖాలు, అలాగే కొంతమంది నిరసనకారులు ధరించే స్కీ మాస్క్‌లు, బందన్నాలపై నిషేధం విధించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో దీనిని చట్టంలా తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. దిగువ సభ ఆమోదంతో, నిషేధం ఇప్పుడు చట్టంగా మారింది. ఇక దీనిని ఉల్లంఘించిన వారికి భారీగానే జరిమానా విధించనున్నారు. ఈ రూల్స్ ను అతిక్రమిస్తే గరిష్టంగా 1,000 స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు మన కరెన్సీలో రూ. 91,300 వరుకు జరిమానా విధిస్తారు. ఇక దీనిని ముస్లిం సమూహాలు వ్యతిరేకిస్తున్నాయి. పర్పుల్ హెడ్‌స్కార్వ్స్ అనే ముస్లిం మహిళా గ్రూపు ప్రతినిధి ఇనెస్ ఎల్-షిఖ్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్‌లో బురఖాలు ధరించిన మహిళలు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. పబ్లిక్ స్థలాలు మరియు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రైవేట్ భవనాలు రెండింటిలోనూ కొన్ని మినహాయింపులు అనుమతించబడతాయి. బెల్జియం, ఫ్రాన్స్ వంటి ఇతర దేశాల్లో కూడా ఇలా ప్రైవేటు ప్రదేశాల్లో ముక్కు, నోరు, కళ్లను కప్పి వేయకూడదనే నిబంధనలు ఉన్నాయి.