Indian Army sings MoU with 11 banks for Agniveer salary package: భారత సైన్యం కొత్తగా తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నివీర్’. ఈ పథకం కోసం ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన సాలరీ ప్యాకేజీ కోసం 11 బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ ఆర్మీ. అగ్నివీరులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ వంటి వాటితో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: mirzapur : ఇండస్ట్రీలో విషాదం.. మీర్జాపూర్ నటుడి కన్నుమూత
అక్టోబర్ 14న ఇండియన్ ఆర్మీ అడ్జటెంట్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సీ బన్సీ పొన్నప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ వి శ్రీహరి, బ్యాంకు అధికారుల ఎంఓయూలపై సంతకాలు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. అగ్నివీర్ శాలరీ ప్యాకేజీ కింద అందించే ప్రయోజనాలతో పాటు బ్యాంకులు సాఫ్ట్ లోన్ సౌకర్యాలను అందిచనున్నాయి. అగ్నిపథ్ స్కీమ్ కింద మొదటి బ్యాచ్ జనవరి 2023 నాటికి శిక్షణా కేంద్రాల్లో చేరుతుందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అగ్నవీర్ పథకం కింద అగ్నివీరులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ. 36,500, నాలుగో ఏడాది రూ.40,000 జీతంగా ఇవ్వనున్నారు. నాలుగేళ్లు ముగిసిన తర్వాత సేవా నిధి కింద రూ. 11.71 లక్షల ప్యాకేజీని అందించనున్నారు. రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్సును అందిస్తోంది. సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో యువ రక్తాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించింది. 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్లు వయసు ఉన్న వారిని సైన్యంలోకి తీసుకోనున్నారు. దీని వల్ల సైన్యం సగటు వయసు 4-5 ఏళ్లకు తగ్గుతుందని సైన్యం భావిస్తోంది. అగ్నివీరుల కోసం మూడు సర్వీసుల్లో ప్రత్యేక ర్యాంక్ ఏర్పాటు చేస్తారు.