Jaishankar: భారతదేశంలో రాబోయే 15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నిక్కీ ఫోరమ్‌లో జైశంకర్ మాట్లాడారు. 95 కోట్ల మంది పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మేలో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు వెళ్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వందశాతం మనకు 15 ఏళ్లు సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. అది 20 లేదా అంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉండవచ్చు అని జైశంకర్ అన్నారు. ప్రతీ దేశం, ప్రతీ సమాజం భిన్నంగా ఉంటుంది, భారతదేశానికి వర్తించేవి ఇతర దేశాలకు ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో స్థిరత్వం లేకుండా, పార్లమెంట్లో మెజారిటీ లేకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో పెద్ద తేడాను చూపిస్తుందని అన్నారు. సంస్కరణవాది, నిబద్ధతతో కూడిన నాయకత్వం, బలమైన రాజకీయ ఆదేశం, పార్లమెంట్‌లో మెజారిటీ ఉంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. మేము గత 10 ఏళ్లుగా ఈ లక్షణాలను కలిగి ఉన్నాము, దానిని మేము కొనసాగిస్తామని చెప్పారు.
రాజకీయ సుస్థిరత అంటే విధాన స్థిరత్వం అని మంత్రి పేర్కొన్నారు. భారతదేశంతో బెట్ వేయాలని చూసే వారు వచ్చే 10 ఏళ్లలో భారత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సూచించారు. ఒక ఏడాది తర్వాత ఎలా ఉంటుందో పెట్టుబడిదారుడికి తెలియకపోతే ఏ స్వదేశీ, విదేశీయుడైనా సంకోచిస్తాడని, కాబట్టి రాజకీయ స్థిరత్వం అనేది చాలా ముఖ్యమైన భాగం అని అన్నారు.