ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు.
Jaishankar: భారతదేశంలో రాబోయే 15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నిక్కీ ఫోరమ్‌లో జైశంకర్ మాట్లాడారు. 95 కోట్ల మంది పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మేలో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు వెళ్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.