India shedding colonial mindset, says PM Modi: ఢిల్లీలో అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతదేశ చరిత్ర వక్రీకరణపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్ధాలుగా మనల్ని దోచుకుని, ఓడిపోయే వ్యక్తులమని చెప్పడానికి ప్రయత్నించారని.. భారతదేశ చరిత్ర కేవలం వలసవాదానికి సంబంధించింది కాదని.. ఇది యోధుల చరిత్ర అని ఆయన అన్నారు. భారతదేశ చరిత్ర అణిచివేతదారులపై శౌర్యాన్ని ప్రదర్శించిందని, త్యాగం, గొప్ప సంప్రదాయం కలిగినదిగా ప్రధాని అభివర్ణించారు.
Read Also: Super Earth: సూపర్ ఎర్త్‌ని గుర్తించిన నాసా.. భూమికి డబుల్ సైజ్..
దురదృష్టవశాత్తూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వలస రాజ్యాల కాలంలో కుట్రలో సృష్టించబడిన చరిత్రనే మనం చదువుకుంటున్నామని..మనల్ని వలసరాజ్యంగా చేసిన వారి ఎజెండాను మార్చాల్సిన అవసరం ఉందని, కానీ అది జరగలేదని ఆయన అన్నారు. దేశంలోని ప్రతీ మూలలో భారత మాత ముద్దబిడ్డలు దైర్యంగా అణచివేతదారులను ఎదుర్కొన్నారని.. తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. ఈ చరిత్రను కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని అన్నారు. లచిత్ బర్ఫుకాన్ పరాక్రమం ముఖ్యం కాదా..? అని ప్రశ్నించారు. మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన అస్సాంలోని వేలాది మంది ప్రజల త్యాగాలు ముఖ్యం కాదా..? అని అడిగారు.
అమృత్ కాల్ సమయంలో బర్పుకాన్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. భారత వారసత్వాన్ని, వీరులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. లచిత్ బర్ఫుకాన్ చరిత్ర ‘నేషన్ ఫస్ట్’ అని తెలియజేస్తుందని..ప్రస్తుత భారతదేశం కూడా ‘నేషన్ ఫస్ట్’ అనే సూత్రంతో ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు. ఒక దేశానికి దాని వారసత్వం గురించి తెలిస్తే అది భవిష్యత్తుకు మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని అన్నారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు.
అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారత చరిత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రకారులు భారత చరిత్రను తిరగరాయాలని కోరారు. అసలైన చరిత్రను అందించాలని సూచించారు. గతం నుంచి మన చరిత్రను వక్రీకరించి చెబుతున్నారంటూ మండిపడ్డారు. చరిత్రకారులకు ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.