India Seeks Action On Khalistan Referendum: కెనడాలో రాడికల్ వ్యక్తులు కొంతమంది చేపడుతున్న ‘‘ ఖలిస్తాన్ రెఫరెండం’’పై భారత్ సీరియస్ అయింది. గురువారం నాడు ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కెనడాను కోరింది. స్నేహపూర్వక దేశమైన కెనడాలో ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలను అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. దౌత్యమార్గాల్లో కెనడా అధికారులకు ఈ విషయాన్ని భారత్ తెలిపిందని.. ఈ విషయంలో కెనడాపై ఒత్తడి తెస్తూనే ఉంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
కెనడాలో నిర్వహిస్తున్న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను ఓ వృథా ప్రయాస అని ఆయన పేర్కొన్నారు. కెనడా ప్రభుత్వం భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవిస్తున్నట్లు పునరుద్ఘాటించిందని.. ఆ దేశంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణను తాము గుర్తించబోమని అరిందమ్ బాగ్చి అన్నారు. ఈ రెఫరెడంపై కెనడా పెద్దగా చర్యలు తీసుకోకపోవడం భారతదేశానికి ఆగ్రహాన్ని తెప్పించింది.
Read Also: Sadhvi Niranjan Jyoti: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?
పంజాబ్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం చేయాలని ఖలిస్తాన్ ఉగ్రవాదులు, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ డిమాండ్ చేస్తున్నాయి. కెనడా, యూకే, అమెరికా వేదికగా కొందరు రాడికల్ సిక్కు ఉగ్రవాదులు భారత్ పై విషాన్ని చిమ్ముతున్నారు. ఇటీవల కాలంలో కెనడాలో పలు హిందు ఆలయాలకు చెందిన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఘటనలపై ఎప్పటికప్పుడు భారత్ తన నిరసనను తెలియజేస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలను కెనడా పెద్దగా పట్టించుకోవడం లేదని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా భారత్ వ్యతిరేకతకు పాల్పడుతున్న వ్యక్తులు కెనడాలోని తలదాచుకుంటున్నారు. అక్కడ ఉండి భారత్ లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు యూకేలో భారతీయులకు, హిందువులపై దాడులు చేస్తున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల లీసెస్టర్ సిటీలో హిందువులు, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హిందువుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పుపెడుతూ చెలరేగిపోయాయి అల్లరి మూకలు. పోలీసుల సమక్షంలో హిందూ దేవాలయంపై దాడి జరిగిన పట్టించుకోవడం లేదు. ఈ అల్లర్లకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భారత్, యూకే ప్రభుత్వాన్ని కోరింది.