Pakistan-Bangladesh: షేక్ హసీనా దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య స్నేహం బలోపేతం అవుతోంది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారం బలపడుతోంది. ఇటీవల కాలంలో పలువురు బంగ్లాదేశ్‌కి చెందిన పలువురు సైనికాధికారులు పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. ఇదే విధంగా పాకిస్తాన్ సైన్యం కూడా ఫిబ్రవరి నుంచి బంగ్లా సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వబోతోంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను పెంచి పోషిస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చెందిన అధికారులు బంగ్లాదేశ్ వెళ్లారు. ఈ పరిణామాలు భారత్‌కి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలను భారత్ నిషితంగా గమనిస్తోంది. జాతీయ భద్రతకు భంగం వాటిల్లితే తగిన చర్యలు తీసుకుంటామని భారత్ శుక్రవారం తెలిపింది. మేజర్ జనరల్ షాహిద్ అమీర్ అఫ్సర్ నేతృత్వంలోని ఐఎస్ఐ ఉన్నత స్థాయి బృందం బంగ్లాదేశ్‌లో 4 రోజుల పర్యటనను శుక్రవారం ముగించిన తర్వాత భారత్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: L2E Empuraan Teaser : లూసిఫర్ సీక్వెల్ “ఎంపురాన్”.. ఓ రేంజ్ లో హైప్ పెంచేసిన గ్లింప్స్
ఈ ఐఎస్ఐ బృందం చిట్టగాంగ్, రంగ్‌పూర్ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. చిట్టగాంగ్ ప్రాంతం మన త్రిపురతో సరిహద్దును పంచుకుంటోంది. ఇక రంగ్‌పూర్‌కి సమీపంలోనే భారత వ్యూహాత్మక కారిడార్, ఈశాన్య రాష్ట్రాలను కలిపే ‘‘చికెన్స్ నెక్’’ లేదా సిలిగురి కారిడార్ ఉంది. ఈ ప్రాంతాల్లో ఐఎస్ఐ పర్యటించినట్లు తెలుస్తోంది. భారత్‌కి వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్న విషయం స్పష్టమవుతోంది.
మరోవైపు పాక్-బంగ్లా మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌లో ప్రో-పాకిస్తాన్ శక్తులైన జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలు బలపడ్డాయి. ప్రస్తుతం వీరిద్దరి చేతుల్లోనే అధికారం ఉంది. ఇవి భారత వ్యతిరేక వైఖరిని అక్కడి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా తెరవెనక ఐఎస్ఐ-జమాత్ కార్యక్రమాలు పెరగడం భారత్‌కి ఆందోళన కలిగించే విషయం.