దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ప్రజల్లో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రుసగా రెండోరోజూ కొత్త కేసులు ఏడు వేల మార్కు దాటాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 7,584 మంది వైరస్ బారిన పడ్డారు. 24 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. గురువారం 3,791 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద ఉంది. రోజురోజుకూ క్రియాశీల కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
క్రితం రోజుతో పోల్చితే 300 మేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 2.26 శాతానికి చేరి, ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్ర, కేరళలోనే ఐదు వేలకు పైగా కేసులొచ్చాయి. దిల్లీ(622)లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైరస్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం స్థానిక ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
భారత్‌లో గురువారం 15,31,510 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 194 కోట్లకు చేరింది. మరో 3,35,050 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.