దేశంలో తొలిసారిగా జంతువుల కోసం కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చారు. పూర్తిగా దేశీయంగా ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. హర్యానాకు చెందిన ఐసీఏఆర్- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ అభివృద్ధి చేసిన ‘అనోకోవాక్స్’ను కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం ప్రారంభించారు. అనోకోవాక్స్ జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యాక్సిన్. క్రియారహితం చేసిన సార్స్ కోవ్ 2 డెల్టా వ్యాక్సిన్. అనోకోవాక్స్ జంతువుల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని.. దీంతో డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లకు చెక్ పెట్టవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ప్రకటించింది.
క్రియా రహితం చేసిన సార్స్ కోవ్ 2(డెల్టా) యాంటిజెన్ తో పాటు ఆల్ హైడ్రోజెల్ ఈ వ్యాక్సిన్ లో సహాయక చర్యగా ఉంటుంది. ఇది కుక్కుల, సింహాలు, చిరుత పులులు, ఎలుకలు, కుందేళ్లకు సురక్షితమైనదిగా తయారీ సంస్థ పేర్కొంది. శాస్త్రవేత్తలు శ్రమ వల్ల దేశం వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోకుండా సొంత వ్యాక్సిన్లను తయారు చేసుకుందని ఇది పెద్ద విజయం అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అనోకోవాక్ తో పాటు, కాన్- కోవ్-2 ఎలిసా కిట్ ను కూడా మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా కుక్కల్లో సార్స్ కోవ్-2 యాంటీ బాడీలను గుర్తించవచ్చు.
గతంలో కొన్ని జూ ల్లో సింహాలు, పులులు కరోనా బారిన పడ్డాయి. కొన్ని సార్లు పెంపుడు జంతువులు కూడా కరోనా వ్యాధి సోకింది. దేశంలో కరోనా సోకడం వల్ల సింహాలు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అనోకో వాక్స్ ద్వారా జంతువుల్లో కరోనాను అరికట్టవచ్చు.