India Ready For Any Situation On China Border, Says Army Chief: చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) ఆకస్మిక పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లోని సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటకలో జరిగిన ఆర్మీడే కార్యక్రమంలో వెల్లడించారు. సైన్యం గతేడాది కాలంలో దేశభద్రతకు సంబంధించి అనేక సవాళ్లను ధృడంగా ఎదుర్కొందని.. యుద్ధ సన్నాహకాలను బలోపేతం చేశామని తెలిపారు.
Read Also: Sankranti Wishes: సంక్రాంతి పండుగ సంతోషం నింపాలి.. రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు
పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ కారణంగా ఇరు వైపుల కాల్పులు తగ్గినప్పటికీ.. ఉగ్రవాద మౌళిక సదుపాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. సైన్యం, భద్రతా బలగాలు చొరబాట్లను, ఉగ్రవాద కదలికలను ఎప్పటికప్పుడు తప్పికొడుతున్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు హింసను తిరస్కరించారని.. సానుకూల మార్పులను స్వాగతిస్తున్నారని మనోజ్ పాండే అన్నారు.
సంప్రదాయానికి విరుద్ధంగా 1949 తర్వాత తొలిసారిగా ఢిల్లీలో కాకుండా బెంగళూర్ లో ఆర్మీ పరేడ్ నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం బెంగళూర్ లోని ఆర్మీ సర్వీస్ కార్ప్స్(ఏఎస్సీ) సెంటర్ అండ్ కాలేజీలో మరో కార్యాక్రమం జరగనుంది. దీనికి ముఖ్యఅతిథిగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. గతేడాది వైమానిక దళం తన వార్షిక ఫ్లై పాస్ట్, ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి చండీగఢ్ కు తరలించారు.