కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 60 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా కార్యక్రమంలో వేగం పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాలు స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్న వేళ.. కీలక సూచనలు చేసింది. సెప్టెంబర్ 5లోగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్ల డోసులు పంపినట్లు తెలిపింది. టీచర్స్ డే కంటే ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరింది.
కాగా… దేశం లో గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 37,593 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,12,366 కి చేరగా ఇందులో 3,17,54,281 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,22,327 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 648 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,35,758 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంటల్లో 61,90,930 మందికి టీకాలు వేశారు.