SCO Summit: ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. భారత్ లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను భారత్ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్మానించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంతో ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి. ఎస్సీఓ విదేశాంగ మంత్రులు, ఆయా దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం మే మొదటి వారంలో గోవా వేదికగా జరగనుంది. దీని కోసం బిలావల్ భుట్టోతో పాటు పాక్ సీజేఐ ఉమర్ అటా బండియల్ లకు భారత్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.
Read Also: Lakhimpur Kheri Case: యూపీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్..
చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాలు ఎస్సీఓలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఎస్సీఓకు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తోంది. సెప్టెంబర్ నెలలో అధ్యక్ష బాధ్యతలను తీసుకుంది. అయితే ఈ ఆహ్వానాలపై పాకిస్తాన్ ప్రభుత్వ స్పందించలేదు. ఒక వేళ అంగీకరిస్తే ఒక దశాబ్ధం తరువాత పాకిస్తాన్ మంత్రి భారత్ లో తొలిసారిగా పర్యటించడం అవుతుంది. 2011లో చివరి సారిగా అప్పటి విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్ లో పర్యటించారు.
ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ – పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు అంటీముట్టనట్లు ఉంటున్నాయి. ఇటీవల బిలావల్ భుట్టో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పై ముఖ్యంగా ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ కసాయిగా అభివర్ణించాడు. ఇది ఇరుదేశాల మధ్య మరోసారి అగ్నికి ఆజ్యాన్ని పోసింది. అయితే భారత ఆహ్వానాన్ని పాక్ అంగీకరిస్తుందో లేదో చూడాలి.