Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్రపన్నిందని, ఈ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. అమెరికా గడ్డపై అమెరికా పౌరుడిని హత్య చేసే కుట్రను ఆ దేశం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వైట్‌హౌజ్ ప్రతినిధి మాట్లాడుతూ.. భారత్‌కి అత్యున్నత స్థాయిలో తమ ఆందోళన చేశామని, దీనికి బాధ్యులు బాధ్యత వహించాలని అమెరికా ఇండియాను హెచ్చరించింది. అయితే ఇది తమ విధానం కాదని భారత్ అమెరికాకు సమాధానం ఇచ్చింది.
ఇదిలా ఉంటే అమెరికా లేవనెత్తిన ఆందోళనలపై భారత్ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ బుధవారం వెల్లడించారు. పన్నూని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. పలు ఏజెన్సీలు అతనిని భారత్‌కి అప్పగించాలని కోరుతున్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది అయిన పన్నూ, ఖలిస్తాన్ రెఫరెండం కోసం కెనడా, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇతనికి అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది.
Read Also: USA: ఇతర మహిళల్ని చూస్తున్నాడని.. బాయ్‌ఫ్రెండ్ కంటిని పొడిచేసిన ప్రేయసి..
ఇటీవల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భద్రతా సహకారంపై చర్చల సందర్భంగా వ్యవస్థీకృత నేరస్తులు, గన్ రన్నర్స్, టెర్రరిస్టులు, ఇతరుల మధ్య సంబంధాలకు సంబంధించిన కొన్ని ఇన్‌పుట్స్‌ని అమెరికా, భారతదేశంతో పంచుకుంది. మా జాతీయ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నందున భారత దేశం అటువంటి ఇన్‌పుట్స్‌ని తీవ్రంగా పరిగణిస్తోందని అరిందమ్ బాగ్చీ చెప్పారు. దీనిపై నవంబర్ 18న అన్ని అంశాలను పరిశీలించేందుకు భారత్ ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని అన్నారు. కమిటీ కనుగొన్న వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటుందని బాగ్చీ వెల్లడించారు.
జూన్ నెలోల కెనడాలోని సర్రే నగరంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. కెనడా అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోందని మండిపడింది. ఈ ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల్లోనే మరో ఉగ్రవాది పన్నూ హత్యకు భారత్ కుట్ర పన్నిందని అమెరికా ఆరోపించడం గమనార్హం.