India flood aid to Pakistan: పాకిస్తాన్ గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ వరదలతో అల్లాడుతోంది. ఏకంగా పాకిస్తాన్ లోని సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్ వరదలతో అతలాకుతలం అవుతోంది. 100కు పైగా జిల్లాలు వరద బారినపడ్డాయి. ఇప్పటి వరకు 1000కి పైగా మరణాలు సంభవించగా.. 3 కోట్ల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశాన్ని భారీ వరదలు, వర్షాలు తీవ్రంగా నష్టపరిచాయి. 6 లక్షలకు పైగా ఇళ్లు వరదల్లో ప్రభావితం అయ్యాయి. సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్సులతో పాటు ఖైబర్ ఫఖ్తుంక్వా, గిల్గిట్- బాల్టిస్థాన్ కూడా వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయి.
ఇదిలా ఉంటే వరదల వల్ల అల్లాడుతున్న పాకిస్తాన్ కు సాయం అందించేందుకు భారత్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సాయంపై భారత్ అత్యున్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ కు సాయం చేయాలా..? వద్దా..? అనే దానిపై భారత్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Read Also: Jagadish Reddy: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్తర్వులు.. ఇది కక్ష్య సాధింపు చర్యేనన్న మంత్రి
పాకిస్తాన్ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపిన నేపథ్యంలో పాకిస్తాన్ కు సాయం అందించడంపై చర్చలు సాగుతున్నాయి. పాకిస్తాన్ లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి బాధగా ఉందని.. ఈ ప్రకృతి విపత్తులో బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి మరియు నష్టపోయిన వారందరికీ మేము మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము మరియు త్వరగా సాధారణ స్థితిని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పాకిస్తాన్ ద్రవ్యోల్భనం దిగజారింది. కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. పాక్ వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్ నుంచి కూరగాయలను, ఇతర వస్తువులను దిగుమతి చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా 2010 వరదల్లో, 2005 భూకంపంలో భారత దేశం, పాకిస్తాన్ కు సహాయం చేసింది.