భారతదేశం-యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చలు ఇన్నాళ్లకు ఫలించింది. మంగళవారం భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’ జరిగిందని ప్రధాని మోడీ అన్నారు. జనవరి 27న భారత్-ఈయూ సమ్మిట్‌లో భారతదేశం-యూరోపియన్ యూనియన్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. సమ్మిట్‌కు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సహ అధ్యక్షత వహించారు.
తగ్గే ధరలు ఇవే..
తాజా ఒప్పందంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. రెండు దేశాలు చాలా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాయి. కొన్ని జీరోకు చేశాయి. ఈ ఒప్పందంతో భారతదేశంలో అనేక ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా కార్లు, రసాయనాలు, వైద్య ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ వస్తువులు చౌకగా లభించే అవకాశాలు ఉన్నాయి.
వైన్, బీర్, పానీయాలు, ఆల్కహాలు, ఆహార ఉత్పత్తులు, రసాయనాలు, యంత్రాలు, ఔషధాలు, ఏరోస్పేస్ వంటి కీలక ధరలు తగ్గనున్నాయి. బీరుపై 50 శాతం, మద్యంపై 40 శాతం, కార్లు, వాణిజ్య వాహనాలపై 10 శాతం సుంకాలు తగ్గాయి.
ఇక ఆలివ్ నూనె, వనస్పతి, కూరగాయల నూనెలపై సుంకాలు పూర్తిగా రద్దు చేశారు. పండ్ల రసాలు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై సుంకాలు జీరో చేశారు. ఇక యంత్రాలపై 44 శాతం, వైద్య ఉత్పత్తులపై 11 శాతం తగ్గించారు. ఇక విమానం, అంతరిక్ష నౌకలపై జీరో సుంకాన్ని విధించారు. ఈ సుంకాలు తగ్గింపుతో కొత్త వ్యాపారాలు.. ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
