Rice Exports Ban: భారతదేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికంగా రైస్ ధరలు పెరగడంతో ఈ చర్య తీసుకోవాలని అనుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత దేశం ఎగుమతులపై నిషేధించాలని భావిస్తోంది. ‘ఎల్ నినో’ పరిస్థితి వాతావరణం, వర్షాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బియ్యం ధరలు పెరగకుండా, లభ్యత పెంచే విధంగా ఉండాలంటే నిషేధం ఒక్కటే మార్గమని అనుకుంటున్నారు.
బాస్మతి కాకుండా మిగతా అన్ని రకాల బియ్యం ఎగుమతులని నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయంగా ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని నివారించాలని అనుకుంటున్నారు. నిషేధం అమలైతే భారతదేశం బియ్యం ఎగుమతుల్లో 80 శాతం ప్రభావితం అవుతుంది. ఈ చర్య ద్వారా దేశీయంగా బియ్యం ధరల్ని కంట్రోల చేయవచ్చు, దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతాయి. ప్రపంచం సగం జనాభాకు బియ్యమే ఆహార వనరుగా ఉంది. ప్రపంచ సరఫరాలో 90 శాతం ఆసియానే వినియోగిస్తోంది.
Read Also: polygamy: ఆ రాష్ట్రంలో “బహుభార్యత్వం” నిషేధం.. సీఎం సంచలన నిర్ణయం..
పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వర్షాలపై ప్రభావం, ఫలితంగా పంటల దెబ్బతినే అవకాశం ఉందనే భయాలు నెలకొన్నాయి. దీంతో బియ్యం ధరలు రెండేళ్ల గరిష్టానికి పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఎగుమతుల్లో 40 శాతం వాటిను భారత్ కలిగి ఉంది. గత సంవత్సరం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో గోధుమలు మరియు మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో భారత్ విరిగిన బియ్యం ఎగుమతులను నిషేధించింది. దీంతో పాటు తెలుపు,బ్రౌన్ రౌస్ ఎగుమతులపై 20% సుంకాన్ని విధించింది. దేశం గోధుమలు, చక్కెర ఎగుమతులను కూడా పరిమితం చేసింది.
భారతదేశం 100 కన్నా ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. బెనిన్, చైనా, సెనెగల్, కోట్ డి ఐవోయిర్, టోగోలు భారత్ కు అతిపెద్ద కస్టమర్లుగా ఉన్నారు. నిషేధం వార్తల నేపధ్యంలో భారతీయ రైస్ మిల్లర్ల షేర్లు పడిపోయాయి. మరోవైపు ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి బియ్యం దిగుమతిదారులు దూకుడుగా బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ఏడేళ్లలో మొదటిసారిగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో రుతుపవనాలు ఆలస్యం, హీట్ వేవ్ వల్ల టమాటా ధరలు చక్కల్ని అంటుతున్నాయి. పప్పుల ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.