polygamy: అస్సాం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ‘బహుభార్యత్వం’పై నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ..బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలని ప్రభుత్వం కోరుకుంటోందని, దీనికి సంబంధించిన బిల్లును త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు.
ఒకే సమయంలో ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటే బహుభార్యత్వం కిందకు వస్తుంది. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) చర్చ జరుగుతున్న సందర్భంలో అస్సాం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వంపై నిషేధం అమలు చేసేందుకు, చట్టపరమైన అంశాలను అన్వేషించడానికి అస్సాం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చర్య యూసీసీ అమలుకు దగ్గరగా ఉంది.
Read Also: Suchitra Krishnamoorthi: ఈ రాత్రికి నాతో పడుకో.. తెల్లారి ఇంటిదగ్గర దింపుతా అన్నాడు
సెప్టెంబరులో జరగబోయే అసెంబ్లీ సెక్షన్‌లో బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నాం.. కొన్ని కారణాల వల్ల అది కుదరకపోతే జనవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చేస్తాం అని గురువారం సీఎం బిస్వ శర్మ చెప్పారు. ముందుగా బహుభార్యత్వంపై నిషేధం విధించాలని అనుకున్నామని, ఈ లోపు యూసీసీ అమలులోకి వస్తే, ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని, అది యూసీసీలో విలీనం అవుతుందని సీఎం అన్నారు. బహుభార్యత్వంపై నిషేధం “ఏకాభిప్రాయం ద్వారా సాధించబడుతుంది, దూకుడు ద్వారా కాదు” అని హిమంత బిస్వా శర్మ ఇంతకుముందు చెప్పారు.
గతంలో అస్సాంలో బాల్యవివాహాలపై హిమంత బిస్వ శర్మ ఉక్కుపాదం మోపారు. ఆ సమయంలో బాల్యవివాహాలు చేసుకున్న వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న వారిని కూడా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులను అనుకుని ఉన్న జిల్లాల్లో స్పెషల్ ఆపరేషన్లు జరిపి అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారిని పట్టుకుంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అస్సాం అడ్డాగా మారకుండా అడ్డుకుంటున్నారు.