AICC New Office: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌కు కాంగ్రెస్ పార్టీ వీడ్కోలు చెప్పింది. కొత్తగా నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
Read Also: Manchu Manoj: మోహన్‌బాబు వర్సిటీకి మంచు మనోజ్.. MBU దగ్గర టెన్షన్, టెన్షన్..!
అయితే, ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండొద్దని గతంలో కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకుంటున్నాయి. గత ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా కొనసాగింది. ప్రస్తుతం 9A కోట్లా రోడ్డులో ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ కొత్త పార్టీ ఆఫీసును నిర్మించుకుంది. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు కొనసాగుతాయని పార్టీ నేతలు తెలిపారు. ఇక, 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం స్థలం కేటాయించింది. ఆ తర్వాత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకుంది. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం స్టార్ట్ చేయగా.. ఈ ఇందిరా గాంధీ భవన నిర్మాణం పూర్తి చేయడగానికి సుమారు 15 ఏళ్లు పట్టింది.