Maldives: ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో అధికారంలోకి వచ్చి, చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాన్ని అవలంభించిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకి త్వరగానే తత్వం బోధపడింది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘‘భారత్ ఎల్లప్పుడు సమీప మిత్రదేశాల్లో ఒకటి, అమూల్యమైన భాగస్వాములు, మాల్దీవులకు అవసరం ఉన్నప్పుడు భారత్ సాయం అందించింది’’ అని శనివారం అన్నారు.
మాల్దీవుల్లోని 28 దీవుల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యాలను భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులు అందచేసింది. ఈ రోజు ఆ పనులు పూర్తైన సందర్భంగా ప్రెసిడెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాలు గణనీయమైన ఆర్థిక లాభాలను అందించడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థలను ఉత్తేజపరిచేందుకు మరియు దేశం యొక్క మొత్తం శ్రేయస్సును సమిష్టిగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్టులు భారత్‌తో మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మైలురాళ్లను సూచిస్తాయని ఆయన హైలైట్ చేశారు.
Read Also: Jammu Kashmir: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు..
మయిజ్జూ మాట్లాడుతూ.. తమ దేశానికి ఉదారమైన, నిరంతర సాయం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి, భారత ప్రభుత్వానికి, భారత దేశ ప్రజలకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు.మాల్దీవులు-భారత్ మధ్య శాశ్వతమైన సంబంధాలను ఆయన చెప్పారు. శతాబ్ధాల స్నేహం, పరస్పర గౌరవం, లోతైన సంబంధాలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. మాల్దీవులు భారతీయ ప్రజలతో చారిత్రాత్మక సంబంధాలకు ఎంతో విలువనిస్తుందని చెప్పారు. ఈ సంబంధాలను పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి అంకితభావంతో ఉన్నామని ఆయన అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల సహకారం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మాల్దీవుల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడంపై ఆ దేశ మంత్రులతో పాటు ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జూతో కూడా భేటీ అయ్యారు. జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం కోసం ముయిజ్జూ ఢిల్లీకి వచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు, చైనా అనుకూల విధానాలు అనుసరించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది. ఇదే కాకుండా ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన సమయంలో ఆ దేశ మంత్రులు నోరుపారేసుకున్నారు. ఆ తర్వాత భారతీయ పర్యాటకులు మాల్దీవుల్ని బాయ్‌కాట్ చేశారు. దీంతో ఆ దేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో భారత్ ఎంత ముఖ్యమో వారికి తెలిసి వచ్చింది. తమ దేశానికి రావాలంటూ ఆ దేశ ప్రభుత్వం, భారత పర్యాటకులనున వేడుకుంటోంది.