Krishna Janmabhoomi: ఉత్తర్‌ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి భూవివాదానికి సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17 వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతించింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్‌ని నియమించేందుకు కోర్టు పచ్చజెండా ఊపింది.
షాహీ ఈద్గా మసీదుపై అడ్వకేట్ కమీషనర్ సర్వే చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, డిసెంబర్ 18న విధివిధానాలు నిర్ణయించబడుతాయని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. విచారణ సమయంలో షాహీ ఈద్గా మసీదు వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది. షాహీ ఈద్గా మసీదు హిందూ దేవాలయానికి సంబంధించ అనేక చిహ్నాలను కలిగి ఉందని, వాస్తవ స్థితిని నిర్ధారించడానికి సర్వే అవసమని డిమాండ్ చేశామని, అందుకు కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని విష్ణు జైన్ అన్నారు. హైకోర్టు తీర్పుపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది.
Read Also: KTR: ‘కేటీఆర్’ నువ్ ఏం భయపడాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు!
ఈద్గా మసీదుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించారు. శ్రీకృష్ణ ఆలయంలోని 13.37 ఎకరాల్లోని ఆలయాన్ని కూల్చి కట్టాడని హిందువులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు జరిగిన వాదనల్లో హిందూ పక్షం సాక్ష్యంగా, మసీదు యొక్క కొన్ని గోడలపై తామరపువ్వుల చెక్కడం, అలాగే హిందూ పురాణాల్లోని ‘శేషనాగ్’ని పోలి ఉండే ఆకారాలు ఉన్నాయని పేర్కొంది. ఇది ఆలయంపై మసీదు నిర్మించబడిందని వారు వాదించారు. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉటంకిస్తూ ముస్లిం పక్షం పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
1968లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ మరియు షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది, దాని కింద కృష్ణ జన్మభూమి కోసం 10.9 ఎకరాల భూమి మరియు మిగిలిన 2.5 ఎకరాల భూమిని మసీదుకు ఇచ్చారు. కృష్ణా జన్మభూమి-షాహి మసీదు వివాదంపై హైకోర్టులో మొత్తం 18 కేసులు ఉన్నాయి.