MP Shocker: మధ్యప్రదేశ్ మోవ్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులపై దుండగులు దాడి చేయడంతో పాటు అందులో ఒకరి గర్ల్ ఫ్రెండ్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. సెప్టెంబర్ 10-11 మధ్య రాత్రి వింధ్యాచల్ శ్రేణుల్లోని జామ్ గేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పర్యాటకానికి ప్రముఖ ప్రదేశంగా ఉన్న ఈ ప్రాంతానికి ఇద్దరు ఆర్మీ అధికారులు తమ ఇద్దరు స్నేహితురాళ్లలో కలిసి పిక్నిక్ వెళ్లారు. రాత్రి ఆరుగురు నిందితులు వారిపై దాడి చేసి, ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయంగా పలు విమర్శలకు కారణమవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ కేసులో ‘‘లౌడ్ మ్యూజిక్’’ నిందితులను ఆ ప్రాంతం వైపు ఆకర్షించేలా చేసిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశం మోవ్ మిలిటరీ కంటోన్మెంట్ నుంచి 30 కి.మీ దూరంలో ఉంది. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి ఇద్దరు ఆర్మీ అధికారులు, వారి ఇద్దరు స్నేహితురాళ్లు ఘటనా స్థలంలోనే ఉన్నారని ఎస్పీ హితికా వాసల్ మీడియాకు తెలిపారు. నలుగుర బిగ్గరగా సంగీతం వింటున్నారని, అర్థరాత్రి నిర్జన ప్రదేశం నుంచి శబ్ధం రావడంతో ఆరుగురు నిందితులు ఘటనా స్థలానికి చేరుకుని నేరానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.
Read Also: Laura Loomer: డొనాల్డ్ ట్రంప్‌తో “లారా లూమర్”.. ఎవరు ఈమె..? ఎందుకంత ప్రచారం..?
దాడి చేసిన వారిలో ఒకర పిస్టల్‌తో బాధితులను బెదిరించగా, మిగతా వారు కర్రలతో దాడికి పాల్పడినట్లు చెప్పారు. నిందితుల్లో ఒక జంటను బందీగా చేసుకున్న నిందితులు, వారిపై దాడి చేసి రూ. 10 లక్షలు తెస్తేనే విడిచిపెడతామని మరో జంటకు చెప్పారు. సంఘటనని మరో జంట అధికారులకు తెలియజేయడం, అక్కడికి పోలీసులు వస్తుండటాన్ని చూసిన నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. ముగ్గురు నిందితులను పట్టుకోగా, మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. వీరి వివరాలు వెల్లడించిన వారికి రూ. 10,000 రివార్డు ప్రకటించారు.
అరెస్టయిన నిందితులకు సెప్టెంబర్ 16 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించారు. మోవ్ కంటోన్మెంట్ పట్టణంలోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో యంగ్ ఆఫీసర్స్ కోర్సు చదువుతున్న 23 మరియు 24 ఏళ్ల ఆర్మీ అధికారులు తమ ఇద్దరు మహిళా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు నలుగురు బాధితులను మోవ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 70 (గ్యాంగ్ రేప్), 310-2 (దోపిడీ), 308-2 (దోపిడీ) మరియు 115-2 (స్వచ్ఛందంగా గాయపరచడం) మరియు ఆయుధ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు అత్యాచారానికి పాల్పడిన మహిళ ప్రస్తుతం షాక్‌లో ఉందని, ప్రస్తుతం ఆమె స్టేట్‌మెంట్ నమోదు చేయడానికి సిద్ధంగా లేదని ఎస్పీ తెలిపారు.