Laura Loomer: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్స్ తరుపున డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఒక పేరు మాత్రం అమెరికాలో విస్తృతంగా వినిపిస్తోంది. ‘‘లారా లూమర్’’ అనే 31 ఏళ్ల యువతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫార్-రైట్, జాతీయవాద భావాలు ఉన్న లారా, ట్రంప్ ప్రచారంలో తరుచుగా కనిపించడం రిపబ్లికన్లతో పాటు అక్కడ మీడియాలో ఆందోళన రేకెత్తిస్తోంది. లూరా వివాదాస్పద చరిత్ర గురించి చివరకు రిపబ్లికన్ పార్టీలో కొందరు నేతలు కూడా భయపడుతున్నారు.
Read Also: Viral News: 24 ఏళ్లుగా రోజూ10 సిగరెట్లు.. ఒక్కసారిగా మానేసిన వ్యక్తి.. ఎలాగో చూడండి
ఎవరు ఈ లారా లూమర్.?:
ముస్లిం వ్యతిరేకిగా పేరున్న లారా లూమర్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌లో కలిసి కనిపించారు. 9/11 దాడులు గురించి గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ ఘటన మనదేశంలో నివసించే వారి పనే అంటూ కామెంట్స్ చేసింది. 9/11 దాడుల జ్ఞాపకార్థం జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌తో లూమర్ చేరారు. ఈ కలయికపై పలు మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రెసిడెంట్ డిబేట్ సమయంలో కూడా ఆమె ట్రంప్‌తో పాటు ఫిలడెల్ఫియా వెళ్లారు. చర్చ సందర్భంగా హైతీ నుంచి వచ్చిన వలసదారులు ఓహియోలో పెంపుడు జంతువులను తింటున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఒక రోజు ముందు లూమర్ కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించారు.
నిజానికి ట్రంప్‌కి లూమర్ ఎంత దగ్గర అనే విషయం అస్పష్టంగా ఉన్నప్పటికీ, ట్రంప్‌తో ఆమెని చూడటంపై సొంత పార్టీ అయిన రిపబ్లికన్లలో కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. అయితే, కొందరు లూమర్ ట్రంప్ చర్చల్లో జోక్యం చేసుకోలేదని, ఆమె సానుకూల వ్యక్తిగా అభివర్ణించారు. రిపబ్లికన్ కన్సల్టెంట్ డెన్నిస్ లెనాక్స్ ట్రంప్ చర్చల పనితీరుని విమర్శించారు. దీనికి లూమర్ వంటి వ్యక్తులపై ఆధారపడటమే కారణమని చెప్పారు.
అయితే, లూమర్ మాత్రం తాను ట్రంప్ మద్దతుకు స్వతంత్రంగా పనిచేస్తున్నాని ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్‌ని ‘‘నిజంగా మన దేశం యొక్క చివరి ఆశ’’గా అభివర్ణించారు. ఆమె తన పరిశోధనల్లో బిజీగా ఉన్నానంటూ మీడియా రిపోర్టులను తోసిపుచ్చారు.
నేపథ్యం ఇదే:
1993లో అరిజోనాలో జన్మించిన లూమర్ ప్రాజెక్ట్ వెరిటాస్ మరియు ఇన్ఫోవర్స్ వంటి సంస్థలకు యాక్టివిస్ట్, కామెంటేటర్‌గా పనిచేశారు. 2020లో, ఆమె ఫ్లోరిడాలోని US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసి డెమొక్రాట్ లోయిస్ ఫ్రాంకెల్ చేతిలో ఓడిపోయింది. రెండేళ్ల తర్వాత మరోసారి అదృష్టాన్ని పరీక్షంచుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. ఈమె తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా అనేక ప్లాట్‌ఫారమ్స్ ఈమెని నిషేధించాయి.