Khalistanis threaten to replace Tricolour: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, ‘ వారిస్ పంజాబ్ దే ’ నాయకుడు అమృత్ పాల్ సింగ్ తప్పించుకు తిరుగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలతో పంజాబ్ యువతను తప్పుదారి పట్టించడంతో పాటు పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికల్లో తేలాయి. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత సరిహద్దు దాటి నేపాల్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడని, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also: Raviteja: నిన్ను చూడగానే ఇంకొకడు వచ్చాడ్రా అనిపించింది, నువ్వు ఫెయిల్ అయితే ఇంటికే…
అమృత్ పాల్ సింగ్ కు సపోర్టుగా కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు అతడికి మద్దతు తెలుపుతూ ఆందోళనలకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తాన్ మద్దతుదారులు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్తాన్ జెండాను ఎగరేస్తామని బెదిరిస్తున్నారు. ముంబై నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ కు రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ రావడంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ విభాగం దర్యాప్తు చేస్తోంది.
మెసేజ్ లో ఖలిస్తానీ మద్దతుదారులు ప్రతిగి మైదాన్ స్వాధీనం చేసుకుంటామని, భారత పతాకాన్ని తీసేస్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల పట్ల అసభ్య పదజాలం ఉపయోగించారు. సెప్టెంబర్ నెలలో ప్రగతి మైదాన్ లో జీ20 సమావేశాలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ వాయిస్ మెసేజ్ వచ్చింది.