తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించిన ఐఎండీ.. పశ్చిమబెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లకు కూడా భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఇక, కొంకణ్, గోవా, మహారాష్ట్రల్లో ఆగస్టు 1వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని తన బులెటిన్‌లో పేర్కొంది ఐఎండీ.