ప్రస్తుతం దేశంలో రెండోదశ కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ సంస్థ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలియజేసింది. కరోనా వైరస్‌లో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్‌లు వస్తే అవి వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా వైరస్‌ల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వైరస్ కట్టడికి సంబందించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ఆ సంస్థ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ విధానం వలన మహమ్మారిని తరిమికొట్టవచ్చిన అన్నారు. అయితే, అన్ని రకాల ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, వేగంగా వ్యాప్తి చెందే వైరస్‌లు వస్తే మూడో వేవ్ తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.